'కృషితో నాస్తి దుర్భిక్షం' అనే నానుడిని నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు చిరంజీవి. స్వయంకృషితోనే అసాధారణమైన మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగారు. అక్కడితో ఆగకుండా ప్రజా శ్రేయస్సు కోసం తపిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారి గుండెల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్నారు. ఆరున్నర దశాబ్దాల వయసు పైబడినా, జీవితంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా ఆయనలోని పట్టుదల ఏమాత్రం తరగలేదు. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆయనలో నిత్యం కనిపిస్తుంటుంది. రాజకీయాలు తనకు పనికిరావని స్వల్ప కాలంలోనే గ్రహించి, 'ఖైదీ నంబర్ 150'తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, అభిమానుల్ని ఆనంద సాగరంలో ఓలలాడించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో 'సైరా' చేసి, ఔరా అనిపించారు. అయితే మునుపటి సినిమా 'ఆచార్య' అనూహ్యమైన రీతిలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవడం ఆయన జీర్ణించుకోలేని విషయం. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోయారు. వారికి ఎంతమేరకు నష్టపరిహారం చెల్లించాలనే విషయంలో ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి.
కాగా, 'ఆచార్య' ఎఫెక్ట్ ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై పడుతున్నదనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది. చిరంజీవి సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుందనే నమ్మకాన్ని 'ఆచార్య' వమ్ముచేసిందని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందుకే ఆశించిన రీతిలో వాటిపై హైప్ రావట్లేదని అంటున్నారు. దసరాకు చిరంజీవి నెక్ట్స్ మూవీ 'గాడ్‌ఫాదర్' విడుదల కానున్నది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'లూసిఫర్' మూవీకి ఇది రీమేక్. చిరంజీవి అంటే.. హీరోయిన్లతో ఆటపాటలు, డాన్సులు, ఫైట్లు, కామెడీ లాంటి వాటిని అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. వీటిలో ఫైట్లు మినహా మిగతావి ఉండవు. ఆయన క్యారెక్టరైజేషనే గాడ్‌ఫాదర్‌కు ప్రాణం లాంటిది. తన నటనతోనే ఆయన ప్రేక్షకుల మనసుల్ని గెలవాల్సి ఉంది. తన ట్రేడ్‌మార్క్ డాన్సులు, కామెడీ, హీరోయిన్‌తో సరసాలు లాంటివి లేకుండా గాడ్‌ఫాదర్‌గా ఆయన ఏమేరకు బాక్సాఫీస్‌ను గెలుస్తారనే చర్చలు నడుస్తున్నాయి.
ఈ మూవీ తర్వాత ఆయన బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న 'మెగా 154', మెహర్ రమేశ్‌తో చేస్తున్న 'భోళాశంకర్' సినిమాలు మన ముందుకు రానున్నాయి. ఈ డైరెక్టర్ల విషయంలో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా లేరని సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, ట్రోల్స్ తెలియజేస్తున్నాయి. క్రేజ్ ఉన్న డైరెక్టర్స్‌ను ఎంచుకోకుండా, వీళ్లను ఆయన ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కావట్లేదని వాపోయిన, వాపోతున్న వాళ్లెందరో! డైరెక్టర్ల వల్ల కూడా ఈ సినిమాలకు హైప్ రావట్లేదని అభిప్రాయపడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువే. దాంతో ఇటు బాబీపై, అటు మెహర్ రమేశ్‌పై ఒత్తిడి మామూలుగా లేదు. ఆ సినిమాలు ఆడితే, వారి కెరీర్లకు మేలు జరుగుతుంది. లేదంటే.. కెరీర్ పరంగా వారు మరింత కష్టకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. వారిని డైరెక్టర్లుగా ఎంచుకున్నందుకు చిరు కూడా విమర్శలకు గురవుతారు. ఈ సినిమాలు చిరును గెలిపిస్తాయా, లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.